గురువారం టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థుల కోసం కొనుగోలు చేసే వస్తువుల టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
మంత్రులకు తెలియకుండానే జీవో నెం.17 విడుదలైందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సవాల్ విసురుతున్న మంత్రులు అజారుద్దీన్, అట్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్‌లకు పూర్తి అవగాహన లేదన్నారు. ఒకవేళ మంత్రులకు ఈ జీవోపై ముందస్తు సమాచారం ఉంటే, సంబంధిత సమావేశాల నిర్ణయాలు, పత్రాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కోటరీ సభ్యులుగా పేర్కొన్న వేమ్ నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ జీవోను తీసుకొచ్చారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల సూచనల మేరకు జీవోల్లో మార్పులు జరిగాయని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కేలా విధానం ఉండేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ, హర్యానాకు చెందిన కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థలకు అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించారు.
టెండర్లలో జరిగినట్లు చెబుతున్న గోల్‌మాల్‌పై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. అమరవీరుల స్థూపం వద్దగానీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దగానీ చర్చ నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు, టెండర్లు పొందిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న స్కాములు, అవినీతి ఆరోపణలను తాము వెలుగులోకి తీసుకొస్తుంటే సహనం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే వెంటనే అన్ని పత్రాలను ప్రజల ముందుంచాలని కోరారు.
పాలమూరు బిడ్డగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండున్నర సంవత్సరాల్లో పాలమూరు జిల్లాకు ఏం చేశారో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.
తెలంగాణ ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకోవడాన్ని సహించబోమని, ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని ప్రజల ముందుకు తీసుకొస్తూనే ఉంటామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరిచి వారితో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.: రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్




