నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరం విజయవంతమైంది. శుక్రవారం పాత కలెక్టరేట్ భవనంలోని 102వ గదిలో నిర్వహించిన ఈ శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 55 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్షల అనంతరం కంటి శుక్లాలు (క్యాటరాక్ట్) ఉన్న 20 మంది రోగులను ఆపరేషన్లకు అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు. వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు అందజేసి, కంటి ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. కంటి చూపును జీవితకాలం కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో విటమిన్-ఏ సమృద్ధిగా ఉండే క్యారెట్, ఆకుకూరలు, చేపలు వంటి పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి సూచించారు.

కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ, పోతుల సుకుమార రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ ఓరుగంటి శ్రీనివాస్, బాదం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో ఉచిత కంటి శిబిరం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *