నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల రక్షణ, హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’పై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాలల రక్షణ, హక్కులు, భద్రత కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులను నివారించేందుకు పోక్సో చట్టంపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన అవసరమని సూచించారు.

ప్రతి చిన్నారికి సురక్షితమైన విద్యా, ఆటపాటల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే ఇబ్బందులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సదస్సులో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. బాలల హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం బాలల రక్షణకు సంబంధించిన పోస్టర్లను సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య ఆవిష్కరించారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు బాలల భద్రతపై చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది శ్రీరామ్ ఆర్య, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుదర్శన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.: శ్రీపురం పాఠశాలలో బాలల రక్షణపై న్యాయ సదస్సు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *