నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా, కొత్తగా నిర్మించుకున్న ఇళ్లలో తొలి దీపావళి పండుగను లబ్ధిదారులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు టి. వెంకటమ్మ నివాసంలో నిర్వహించిన వేడుకల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొన్నారు. వెంకటమ్మ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించి, బాణాసంచా కాలుస్తూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు, పథకం అమలులో ఎలాంటి అవినీతికి తావులేదని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 2,802 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. రెండో విడతలో మరికొంతమంది అర్హులకు ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.: మా ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *