నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ధన త్రయోదశి, శని త్రయోదశి ఒకే రోజు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

శని గ్రహదోష నివారణ కోసం భక్తులు శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామివారికి భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ ప్రత్యేక పూజల్లో అర్థాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని దోష నివారణ కోసం భక్తులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ.. ఈ మాసంలో శనేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా భక్తులకు విశేష ఫలితాలు కలుగుతాయని తెలిపారు. జన్మరాశి, గోచార రీత్యా శని గ్రహ ప్రభావాలు ఉన్నవారు తమ శక్తి మేరకు స్వామివారిని పూజించాలని సూచించారు.

అలాగే ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మసూత్రం కలిగిన పరమశివునికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. నందీశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో నీటి వసతితో పాటు అన్నప్రసాద పంపిణీ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, సేవకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.: వడ్డేమాన్‌లో వైభవంగా శని త్రయోదశి ప్రత్యేక పూజలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *