పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని రామాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన సొంత నివాసాన్ని సమకూరుస్తుందని చెప్పారు.
ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరగాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని తమ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.
ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జూపల్లి స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.: రామాపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *