నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమని ఆమె అన్నారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని సీతక్క ఆరోపించారు. ఆ కాలంలో కేవలం 80 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారని, 10 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. అభివృద్ధి కంటే అప్పులు, వడ్డీల భారం పెంచడంపైనే బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం వడ్డీలేని రుణాలను అందిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలపై రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలు మిగిల్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు అందులో లేని పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోందని చెప్పారు.
హరీష్ రావు తరచూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మంత్రి, “అబద్ధాలకు అర్థం హరీష్ రావే” అని విమర్శించారు. ప్రజల ముందుకు వచ్చి కనీసం ఒక్క నిజమైన విషయాన్ని అయినా ఒప్పుకోవాలని సూచించారు. అలాగే ఎమ్మెల్సీ కవిత అడుగుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ నాయకత్వం ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కేటీఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. నల్లమల ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడటం సరైంది కాదని, నల్లమల పౌరుషం, శౌర్యం రేవంత్ రెడ్డిలో ప్రతిబింబిస్తాయని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆమె, హైదరాబాద్ మెట్రో విస్తరణకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేస్తున్నారని, గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో పంటల దిగుబడులు నమోదయ్యాయని తెలిపారు. అదే స్థాయిలో ప్రభుత్వం పంటల కొనుగోళ్లు కూడా నిర్వహించిందని మంత్రి సీతక్క వెల్లడించారు.: హరీష్ రావు వ్యాఖ్యలు తగవు.. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు మానుకోవాలి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *