నాగర్‌కర్నూల్ జిల్లా అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. దుందుభి వాగుపై సిర్సివాడ గ్రామం సమీపంలో రూ.20.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, అనిరుధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నిరంతర కృషి, పట్టుదల ఫలితంగానే ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించిందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నాగర్‌కర్నూల్–జడ్చర్ల మధ్య అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ప్రతి వర్షాకాలంలో దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, బ్రిడ్జి నిర్మాణంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకల్లో పెద్ద ఊరట పొందనున్నారని వివరించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. నాగర్‌కర్నూల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే సీఆర్ నిధుల కింద రూ.30 కోట్లు, ఎంఆర్ నిధుల కింద రూ.13 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అదనంగా వివిధ రహదారి అభివృద్ధి పనుల కోసం రూ.84 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేశామని, ఒక్కో భవనం నిర్మాణానికి సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ప్రజలు 50 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నేడు సాకారమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించిందని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్క ఇప్పటికే నాగర్‌కర్నూల్ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లకు పైగా నిధులు అందించారని పేర్కొన్నారు.
దుందుభి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత జడ్చర్ల, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానుండటంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశను చూపనుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.: దుందుభి వాగుపై రూ.20.20 కోట్ల హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *