జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని, అనేక పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ABVP నాయకులు పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో కొన్ని పాఠశాల భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విద్యా హక్కు చట్టం (RTE)ను కచ్చితంగా అమలు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనేక హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే విద్యారంగ సమస్యలు అధికంగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్న ABVP నాయకులు, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సీతక్కను కోరారు. జిల్లా కన్వీనర్ మొక్తాల శంతన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ABVP డిమాండ్ చేసింది.: నాగర్‌కర్నూల్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP వినతి

