సోమవారం నాగర్‌కర్నూల్‌లో మంత్రి సీతక్క పర్యటన.. రూ.20 కోట్ల హై లెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ నెల 22న సోమవారం పర్యటించనున్నట్లు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.
మంత్రి సీతక్క సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ నుంచి బయలుదేరి తాడూరు మండలంలోని సిర్సవాడ గ్రామానికి చేరుకుని దుండుభి వాగుపై రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి (హెచ్‌ఎల్‌బీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత సిర్సవాడతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు అన్ని కాలాల్లో సురక్షిత రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే రాకపోకల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
అనంతరం నాగర్‌కర్నూల్ పట్టణంలో మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ప్రతిపాదించిన రూ.5 కోట్ల వ్యయంతో కూడిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను మంత్రి పరిశీలించనున్నారు. మహిళా సంఘాల బలోపేతం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ భవన్ ఉపయోగపడనుంది.
అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులకు భద్రత, మానసిక పరామర్శ, న్యాయ సహాయం, పునరావాస సేవలను ఒకే వేదికపై అందించేందుకు ఏర్పాటు చేయనున్న భరోసా సెంటర్ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.: సోమవారం నాగర్‌కర్నూల్‌లో మంత్రి సీతక్క పర్యటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *