కొల్లాపూర్, జూన్ 10:
ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్, కొడేరు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై బుధవారం క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంపీడీవోలు, హౌసింగ్ డీఈలు, గెజిటెడ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొల్లాపూర్ నియోజకవర్గంలో మొదటి విడత కింద మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇండ్లలో నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే 15 రోజుల్లోపు అన్ని అనుమతులు పూర్తి చేసి, సాంకేతిక అనుమతి పొందిన ప్రతి ఇంటి నిర్మాణం ప్రారంభం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. గడువులోగా ప్రారంభం కాని ఇండ్లను అవసరమున్న ఇతర గ్రామాలకు కేటాయించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. గ్రామాల్లో మంజూరైన ప్రతి ఇంటి నిర్మాణం ప్రారంభమయ్యేలా ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చొరవ తీసుకోవాలని సూచించారు.
సాంకేతిక (L3) కారణాలతో పేమెంట్లు నిలిచిపోయిన 57 మంది లబ్ధిదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మంత్రి తెలిపారు. అర్హులైన నిరుపేదలు ఎలాంటి సాంకేతిక కారణాలతోనూ ఇంటికి దూరం కాకూడదని స్పష్టం చేశారు.
రెండో విడతలో మంజూరైన 2,000 ఇందిరమ్మ ఇండ్లలో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు తమ బాధ్యతగా భావించి నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *