నాగర్‌కర్నూల్ జిల్లాలో సమగ్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9,768 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక (Annual Credit Plan)ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ బుధవారం విడుదల చేశారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశంలో ఈ ప్రణాళికను ఆవిష్కరించారు.
జిల్లా లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రణాళిక ద్వారా వ్యవసాయం, సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమలు (MSME), గృహ నిర్మాణం, విద్య, పునరుత్పాదక ఇంధనం, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి విస్తృత స్థాయిలో రుణ సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తం 2,77,772 ఖాతాలకు రుణాలు అందించేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికే అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ రూ.8,637 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించారు. పంటల సాగు, యాంత్రీకరణ, సాగునీటి వసతులు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నారు. రైతులు సకాలంలో పంట రుణాలు పొందేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి రూ.1,014 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించారు. గ్రామీణ పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై దృష్టి సారించారు. అలాగే విద్యా రుణాలకు రూ.37.90 కోట్లు, గృహ నిర్మాణ రుణాలకు రూ.316.25 కోట్లు కేటాయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం ఉండకూడదని, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించాలని బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.: నాగర్‌కర్నూల్ జిల్లాకు రూ.9,768 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక విడుదల









