నాగర్‌కర్నూల్, జూలై 7: నాగర్‌కర్నూల్ జిల్లా అభివృద్ధిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దాదాపు 47 ఏళ్ల తర్వాత జిల్లాకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. రూ.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు జూలై 8న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు.
నాగర్‌కర్నూల్‌లో ప్రస్తుతం ఉన్న పాత బస్టాండ్‌కు 1979లో శంకుస్థాపన జరగగా, 1983లో అది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అనంతరం 1992లో బస్ డిపో ఏర్పాటు చేయడంతో జిల్లా రవాణా సేవలు మరింత విస్తరించాయి. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రద్దీ, ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆధునిక ప్రయాణికుల నిరీక్షణ మందిరాలు, విశాలమైన బస్ బేలు, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, డిజిటల్ సమాచారం వంటి సౌకర్యాలతో ఈ బస్టాండ్‌ను నిర్మించనున్నారు. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందడంతో పాటు జిల్లా ప్రజారవాణా వ్యవస్థకు కొత్త ఊపు లభించనుంది.
నల్లమల అంచున ఉన్న వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన నాగర్‌కర్నూల్, జిల్లా కేంద్రంగా పునరుద్ధరణ పొందిన తర్వాత అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజారవాణా మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా ఈ ప్రాజెక్టు అమలవుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డా. మల్లురవి, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కృషితో ఈ బస్టాండ్ మంజూరైందని స్థానికులు పేర్కొంటున్నారు.
నూతన బస్టాండ్ నిర్మాణంతో నాగర్‌కర్నూల్ అభివృద్ధికి మరింత వేగం చేకూరుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.: 47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు నూతన బస్టాండ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *