నాగర్ కర్నూల్: జిల్లాలో విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫిట్‌నెస్ లేని బస్సులను నడపడం, సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలించడం, బస్సుల్లో క్లీనర్లు లేకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా అధికారులు పాఠశాల బస్సులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కోరారు.

అదేవిధంగా స్కూల్ ఫీజులు, యూనిఫామ్‌లు, టై, బెల్టులు, షూస్, బస్సు రవాణా ఛార్జీలు, పరీక్ష ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులు, నిర్వహణపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరారు.

కాలేజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అరవింద్ చారి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ఎంఈఓలు, ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని దన్నోజు అరవింద్ చారి కోరారు.: ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులతో విద్యార్థుల భద్రతకు ముప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *