నాగర్‌కర్నూల్, జూలై 14, 2026: పదేపదే న్యుమోనియా, నిరంతర దగ్గు, జ్వరంతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడి శ్వాసనాళంలో నాలుగేళ్లుగా చిక్కుకుపోయిన ఆట వస్తువు ‘ఈల’ (Whistle)ను అధునాతన బ్రోంకోస్కోపీ విధానం ద్వారా విజయవంతంగా తొలగించినట్లు మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే ఈ క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి బాలుడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచినట్లు వెల్లడించారు.

బాలుడు చాలా కాలంగా నిరంతర దగ్గు, జ్వరం, పదేపదే వచ్చే న్యుమోనియాతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందడంతో పాటు పలుమార్లు యాంటీబయాటిక్స్ వాడినప్పటికీ సమస్య తగ్గలేదు. దీంతో అతని ఆరోగ్యం, జీవన నాణ్యత తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

వివరణాత్మక క్లినికల్ పరీక్షల అనంతరం శ్వాసనాళంలో ఏదైనా ఫారిన్ బాడీ ఉండవచ్చని ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య బృందం అనుమానించింది. బ్రోంకోస్కోపీ పరీక్ష నిర్వహించగా బ్రోంకస్‌లో చాలా కాలంగా చిక్కుకుపోయిన ఆట వస్తువు ‘ఈల’ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు నాలుగేళ్లుగా శ్వాసనాళంలో ఉన్న ఈ వస్తువును అత్యంత జాగ్రత్తగా బ్రోంకోస్కోపీ ద్వారా తొలగించారు.

ఈ ప్రక్రియలో జనరల్ అనస్థీషియా కింద ఫ్లెక్సిబుల్ బ్రోంకోస్కోపీ ద్వారా శ్వాసనాళాన్ని పరిశీలించారు. శ్వాసనాళంలో పేరుకుపోయిన కఫం, చీమును తొలగించడంతో పాటు క్రయో ప్రోబ్ సహాయంతో గ్రాన్యులేషన్ టిష్యూను కూడా తొలగించారు. మూసుకుపోయిన శ్వాసనాళాన్ని శుభ్రపరిచి బ్రోంకస్ సాధారణ స్థితిని పునరుద్ధరించినట్లు వైద్యులు తెలిపారు.

ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా. యుగంధర్ భట్టు, అనస్థీషియాలజిస్ట్ డా. విక్రమ్ మరియు వారి బృందం, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. కలాధర్ పర్యవేక్షణలో ఈ చికిత్స విజయవంతంగా నిర్వహించారు.

ఫారిన్ బాడీని తొలగించిన అనంతరం బాలుడిలో నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పూర్తిగా తగ్గినట్లు వైద్యులు వెల్లడించారు. ఫాలో-అప్ సమయంలో జ్వరం, పదేపదే న్యుమోనియా వంటి సమస్యలు తిరిగి కనిపించలేదని తెలిపారు. బాలుడి వ్యాయామ సామర్థ్యం, ఆకలి, చురుకుదనం గణనీయంగా మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఛాతీ ఇమేజింగ్‌లో కూడా ఊపిరితిత్తుల పరిస్థితి మెరుగుపడినట్లు వెల్లడించారు.

పిల్లలు, కౌమార వయస్సు వారిలో పదేపదే వచ్చే లేదా చికిత్స చేసినప్పటికీ తగ్గని న్యుమోనియా ఉన్నప్పుడు శ్వాసనాళంలో ఫారిన్ బాడీ ఉండే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని డా. యుగంధర్ భట్టు సూచించారు. తొలి దశలోనే బ్రోంకోస్కోపీ చేయడం ద్వారా సమస్యను గుర్తించడంతో పాటు చికిత్స కూడా అందించవచ్చని తెలిపారు. సకాలంలో ఫారిన్ బాడీని తొలగించడం ద్వారా శాశ్వత ఊపిరితిత్తుల నష్టాన్ని నివారించవచ్చన్నారు.

అధునాతన బ్రోంకోస్కోపిక్ ప్రక్రియల్లో అనస్థీషియా ప్రణాళిక, శ్వాసనాళ నిర్వహణ, వైద్య బృందాల మధ్య సమన్వయం అత్యంత కీలకమని డా. విక్రమ్ పేర్కొన్నారు. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, అనస్థీషియాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా క్లిష్టమైన కేసుల్లో సురక్షితమైన చికిత్స అందించవచ్చని డా. కలాధర్ తెలిపారు.

శ్వాసనాళ సంబంధిత క్లిష్ట వ్యాధులను సాధారణ పరీక్షల్లో గుర్తించడం కొన్ని సందర్భాల్లో కష్టమవుతుందని, అలాంటి పరిస్థితుల్లో అధునాతన ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది.

నిరంతర దగ్గు, పదేపదే న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.మరిన్ని వివరాలకోసం సంప్రదించాల్సిన నెంబర్లు
ఎ. వాసుకిరణ్ రెడ్డి – 97057 71230 / 99499 98378: బ్రోంకోస్కోపీతో తొలగించి 17 ఏళ్ల బాలుడికి ప్రాణదానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *