ప్రజావాణి అనంతరం శాఖల వారీగా పెండింగ్ ఫిర్యాదులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వినతుల పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా సంబంధిత అంశాలపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను ప్రతి సోమవారం అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హాస్టళ్లలో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, భద్రత, సిబ్బంది కొరత వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి వారం వేర్వేరు హాస్టళ్లను సందర్శించి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలన్నారు.
అమ్రాబాద్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో తాగునీటి సమస్య, విద్యార్థుల కమిటీ లేకపోవడం వంటి అంశాలను పరిశీలించాలని, ఊరుకొండ హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను గుర్తించాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్ లేకపోవడం, పారిశుధ్య లోపం, పాముల బెడద వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు రూపొందించాలని సూచించారు.
విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు.: నాగర్‌కర్నూల్ ప్రజావాణికి 71 ఫిర్యాదులు..

