నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని బావాజీపల్లి గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత పశు టీకాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ హాజరై రైతులకు అవగాహన కల్పించారు. పశుసంపదను అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పాడి పశువులు, గేదెలకు లంపీ స్కిన్ వ్యాధి (LSD), గొంతువాపు వ్యాధి (HS), జబ్బవాపు వ్యాధి (BQ) నివారణకు ఉచిత టీకాలు వేశారు. అదేవిధంగా గొర్రెలు, మేకలలో ప్రాణాంతకంగా మారే చిటుక రోగం (ET) నివారణకు ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్య అధికారులు గ్రామంలోని పశువులను పరిశీలించి టీకాలు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పశుసంపద రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆధారమని, పశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే పాల ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. లంపీ స్కిన్ వంటి వైరల్ వ్యాధులు పశువుల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు రైతులకు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాలను ప్రతి పశువుకు తప్పనిసరిగా వేయించాలని రైతులకు సూచించారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో టీకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పశువులకు అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప పశువైద్య అధికారులకు సమాచారం అందించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి. జ్ఞానశేఖర్, మండల పశువైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, పశువైద్య సిబ్బంది తిరుపతయ్య, ఖాదర్, యాదగిరి, శాంతయ్య, గోపాలమిత్రులు జగ్జీవన్, స్వామి, గ్రామ పెద్దలు, పాడి రైతులు, గొర్రెల కాపర్లు తదితరులు పాల్గొన్నారు.: పశువుల వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు తప్పనిసరి: కలెక్టర్








