నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం ఎన్నికల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎన్నికల సంఘం నియమించిన AEROలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సి ఉండగా, నాగర్‌కర్నూల్, బిజినపల్లి, తెల్కపల్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరవడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. మండల పరిషత్ కార్యాలయాలను పార్టీ సమావేశాలకు వినియోగించడం, అధికారులు అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే మౌఖిక ఆదేశాల మేరకు వలస వెళ్లిన ఓటర్ల పేర్లను తొలగించే ప్రక్రియ చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 15,632 మంది ఓటర్లను శాశ్వత వలసదారులుగా, మరో 5,655 మందిని గైర్హాజరైన ఓటర్లుగా నమోదు చేసి మొత్తం 21,287 మంది ఓటర్ల పేర్లను డ్రాఫ్ట్ రోల్ నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

ఈ అంశంపై ఇప్పటికే ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. SIR ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే పార్టీ తరఫున ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.: నాగర్‌కర్నూల్‌లో ఓటర్ల జాబితాపై భారీ ఆరోపణలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *