జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని 15వ శతాబ్దం వ్యాసరాయుల కాలంనాటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని పెద్ద చింతరేవుల అన్న ప్రసాద ట్రస్ట్ అన్నసత్రంలో ఉడిపి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు.

ఉడిపి పాలిమార్ పీఠాధిపతుల 48వ చాతుర్మాస్య ఉత్సవాల్లో భాగంగా శ్రీ 1008 శ్రీ విద్యాదిశ తీర్థ శ్రీపాదులు, శ్రీ 1008 శ్రీ విద్యారాజేశ్వర తీర్థ శ్రీపాదుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి, ఆదివారం ప్రత్యేకంగా రాఘవేంద్ర స్వామి ఆరాధన పూజలు నిర్వహించారు. ఉడిపి వేద పండిత బ్రాహ్మణోత్తములు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పీఠాధిపతులు భాగవత, రామాయణ ప్రవచనాలు చేశారు. ఆలయంలోని మూలమూర్తులైన సీతారామచంద్ర, లక్ష్మణ సమేత హనుమంతుడు, నరసింహస్వామి, హైగ్రీవస్వామి, ఉడిపి శ్రీకృష్ణస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లకు దశ విధాలుగా శతహారతులు (100 హారతులు) సమర్పించారు. ఉడిపి శ్రీకృష్ణస్వామివారికి డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆలయ ఆవరణలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిత్య హోమాల్లో భాగంగా పవమాన హోమం, నవగ్రహ హోమాలను వేద పండితులు నిర్వహించారు. అనంతరం పెద్ద చింతరేవుల అన్న ప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆద్య వామనాచారి, ఆద్య కిష్టాచారి, ఆద్య మద్వాచారి, ఉడిపి వేద పండితులు, కర్ణాటక, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.: పెద్ద చింతరేవులలో వైభవంగా రాఘవేంద్ర స్వామి ఆరాధన పూజలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *