తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూల కారణంగా ఇంధన కొరత ఉందనే వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. రాబోయే మూడు నెలలకు సరిపడా నిల్వలు ఇప్పటికే ఉన్నాయని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను నమ్మి గందరగోళానికి గురికావద్దని సూచించారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఇంధన సరఫరాను గణనీయంగా పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ కంటే సరఫరా అధికంగా ఉందని పేర్కొన్నారు. ఉదాహరణకు, ఒక రోజుకు 17,246 కిలోలీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరిగినట్లు వివరించారు. అంటే 652 కిలోలీటర్ల అదనపు నిల్వ మిగిలిందని చెప్పారు.అదేవిధంగా రాష్ట్రంలో అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధన నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మి అధికంగా కొనుగోళ్లు చేయడంతో డిమాండ్ ఒక్కసారిగా 25 శాతం పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. సరఫరా పరంగా సగటున 22 శాతం అదనపు నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

కొన్ని పెట్రోల్ బంక్ల వద్ద నో-స్టాక్ బోర్డులు కనిపించడం ట్యాంకర్లు సమయానికి చేరకపోవడం వల్ల మాత్రమేనని, వాస్తవానికి ఎటువంటి కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రజలు కంటైనర్లు, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవడం చట్టవ్యతిరేకం మాత్రమే కాక ప్రమాదకరమని హెచ్చరించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 596 పెట్రోల్ బంకులు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, హైదరాబాద్ పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇంధన సరఫరాలో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.ఎల్పీజీ విషయంలో కూడా ఎటువంటి కొరత లేదని మంత్రి తెలిపారు. అయితే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంతమేర సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మొత్తంగా రాష్ట్ర ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని, ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.: రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *