2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిసెంబర్ త్రైమాసిక లక్ష్యాల సాధనపై బ్యాంకుల నియంత్రణ అధికారులు, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం బ్యాంకుల సహకారంతో పలు పథకాలను అమలు చేస్తోందని అదనపు కలెక్టర్ తెలిపారు.
ప్రత్యేకంగా వ్యవసాయ రుణాలు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారవేత్తలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, అలాగే DRDA, MEPMA, SC, ST, BC కార్పొరేషన్ల ద్వారా అందించే రుణాల గ్రౌండింగ్ విషయంలో బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు లక్ష్యాలను చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు.గ్రామీణ స్వయం ఉపాధి సంస్థల ద్వారా శిక్షణ పొందిన అతి పేదవారు రుణాల కోసం చేసిన దరఖాస్తులను బ్యాంకులు ఆలస్యం చేయకుండా మంజూరు చేయాలని కోరారు. అలాగే గృహ నిర్మాణం, విద్యా రుణాలు వంటి ప్రాధాన్యత రంగాలలో రుణాల మంజూరును వేగవంతం చేయాలని ఆదేశించారు.
చిన్న, మధ్య తరహా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాల విషయంలో బ్యాంకులు తమ లక్ష్యాలను త్వరగా సాధించాలని సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు విద్యా రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా, సెర్ఫ్, SC, ST, BC కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే పథకాల లక్ష్యాలను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల గ్రౌండింగ్, పెండింగ్ అంశాలు మరియు ఎదురవుతున్న సమస్యలను అదనపు కలెక్టర్, బ్యాంకర్ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా 2026–27 సంవత్సరానికి సంబంధించిన నాబార్డ్ ప్రొటీన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, ఆర్బిఐ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఆర్వో మనోహర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ప్రతినిధి ఆశీస్ రంజన్, ఎస్బీఐ ప్రతినిధి రాకేష్, టీజీబీ మేనేజర్ దేవుల్ల, పీడీ డిఆర్డిఏ చిన్న ఓబులేసు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గోపాల్ నాయక్, వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి తదితరులు పాల్గొన్నారు.: ప్రభుత్వ పథకాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి




