శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గురువారం ధ్వజారోహణం, గరుడసేవ, బేరీ పూజలు ఘనంగా నిర్వహించారు. రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ తెలిపారు.
వేదమూర్తులైన బ్రాహ్మణ అర్చక బృందం చక్రవర్తి శ్రీనివాసచార్యులు, కందాడై శ్రీనివాసచార్యులు వారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. దేవత ఆహ్వానం కార్యక్రమం నిర్వహించి, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం సామూహికంగా జరిగింది.
శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో భక్తుల సేవ కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళల్లో గరుడవాహన సేవ, ఎదుర్కొల్లు, కోలాటం, మహిళల ప్రత్యేక భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తుల సమక్షంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తాలూకా మున్నూరు కాపు సంఘం యువత ఆధ్వర్యంలో టిటిడి కళ్యాణ మండపంలో భక్తులకు ఉచిత అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.
భక్తులు స్వామి వారికి సమర్పణ నిమిత్తం అక్షింతలు, వడివబియ్యం, వస్త్రాలు, తలంబ్రాలు, పూలు, పండ్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ రామాలయంలో వైభవంగా గరుడసేవ, ధ్వజారోహణం, బేరీ పూజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *