ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీ ఆంజనేయస్వామి వారికి పంచామృతం, విశేష సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాదీశ తీర్థ శ్రీపాదులు, శ్రీ 1008 శ్రీ విద్యారాజేశ్వర తీర్థ శ్రీపాదుల ఆధ్వర్యంలో 30వ రోజు చాతుర్మాస్య వ్రత దీక్షలో భాగంగా నిత్య పూజలు, హోమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉడిపి వేద పండితులచే వేదమంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన చక్ర మండల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని సన్నిధిలో సుదర్శన చక్రాన్ని ఆవాహన చేసి, సుదర్శన అష్టకం, సుదర్శన మంత్రాలతో ప్రత్యేక పుష్పాలు, బిల్వపత్రాలు, పూజా సామగ్రితో విశేష పూజలు చేశారు.
నిత్య కార్యక్రమాల్లో గోపూజ, నవగ్రహ హోమం, పవమాన హోమం నిర్వహించగా, స్వామీజీలు భాగవతం, రామాయణ ప్రవచనాలు అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదం, మంత్రాక్షతలు, ఫలాలను స్వీకరించారు. పెద్ద చింతరేవుల అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సెప్టెంబర్ 25 వరకు చాతుర్మాస్య దీక్షా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
: పెద్ద చింతరేవులలో వైభవంగా సుదర్శన చక్ర మండల పూజలు..



