నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు ఆందోళన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సుమారు 200 ట్రాక్టర్లతో వెలమ ఫంక్షన్ హాల్ నుంచి సబ్‌స్టేషన్ వరకు భారీ ర్యాలీ చేపట్టి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల కరెంటు కట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారాన్ని కూడా రైతులు, ప్రజలు కట్ చేస్తారని ఆరోపించారు. రైతులకు విద్యుత్, సాగునీరు, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

కృష్ణా, గోదావరి నదుల్లో అందుబాటులో ఉన్న వరద నీటిని తెలంగాణ ప్రయోజనాలకు వినియోగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లను నడపాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు.

యూరియా కొరతపై రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. బస్టాండ్ కూడలిలో ఉట్టికి యూరియా బస్తాలు కట్టి, వాటిని అందుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, అనేక హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రైతుభరోసా, రైతుభీమా, సాగునీరు, విద్యుత్, ఎరువుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నాయకులు సంబంధిత ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

: నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ భారీ రైతు నిరసన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *