ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారురాలు అనిత తనకు మంజూరైన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ నూతన గృహాన్ని సందర్శించారు. రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వారు అనిత, ఆమె భర్త రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను సాకారం చేసుకున్న అనిత కుటుంబాన్ని కలెక్టర్ అభినందించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మార్వో సైదులు, ఎంపీడీవో, చెన్నారం సర్పంచ్ ప్రేమలత, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం



