నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులంటే తనకు ఎంతో గౌరవమని, తన తండ్రి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడేనని తెలిపారు. అందువల్ల ఉపాధ్యాయ వృత్తి విలువ, సమాజంపై వారి ప్రభావం తనకు వ్యక్తిగతంగా తెలుసునని పేర్కొన్నారు.
తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే ప్రతి మాట, ఇచ్చే ప్రతి సూచన విద్యార్థుల ఆలోచనా విధానాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని అన్నారు. విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథం వంటి మంచి లక్షణాలను పెంపొందించాలని సూచించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని అన్నారు.
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 70 మందిని కలెక్టర్ అభినందించారు. ఈ సన్మానం వారి సేవలకు గుర్తింపుగా నిలుస్తుందని, అవార్డు బాధ్యతను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
: ఉపాధ్యాయులే భావితరాలకు దిశానిర్దేశకులు…



