నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 7: వానాకాలం వరి కొనుగోళ్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్ చేన్నయతో కలిసి ఆర్టీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వానాకాలం వరి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేలా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఆయా కేంద్రాల్లో తూకం యంత్రాలు, గన్నీ సంచులు, టార్పాలిన్లు, ధాన్యం నిల్వకు అవసరమైన ఇతర మౌలిక వసతులను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత కలిగిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు రవాణా ఏర్పాట్లను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

కొనుగోలు ప్రక్రియలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా మండల, జిల్లా స్థాయిలో సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సమావేశంలో పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.: వానాకాలం వరి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *