గ్రామంలో జరుగుతున్న సర్వే పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, సర్వే బృందం మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంకటాపూర్ గ్రామంలో మొత్తం 95 సర్వే నంబర్ల పరిధిలో 661 ఎకరాల 4 గుంటల భూమి ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
సర్వే చేసిన గ్రామ సరిహద్దుల మొత్తం విస్తీర్ణం 670 ఎకరాల 15 గుంటలు కాగా, గ్రామకంఠం విస్తీర్ణం 14 ఎకరాల 14 గుంటలు, పాత గ్రామకంఠం విస్తీర్ణం 4 ఎకరాల 24 గుంటలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో రోడ్ల సర్వే కొనసాగుతోందని, అనంతరం ప్రభుత్వ భూములు, పట్టా భూముల సర్వే చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మొత్తం రీ-సర్వే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా 10 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, సరిహద్దులు, గ్రామకంఠం తదితర వివరాలను సంబంధిత రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని సూచించారు.
అదేవిధంగా గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
: భూ రీ-సర్వేను 10 రోజుల్లో పూర్తి చేయాలి




