సోమవారం నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, గ్రామపంచాయతీ భవనం, వీవో భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆయా పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వెంకటాపురం గ్రామంలో మొత్తం 12 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 8 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మరో రెండు ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, సంబంధిత లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి, ప్రభుత్వ పథకం ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. నిర్మాణ పనులు ప్రారంభించకపోతే మంజూరు రద్దయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన లబ్ధిదారులు రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
నిర్మాణంలో ఉన్న ప్రతి ఇంటి పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామపంచాయతీ, వీవో భవన నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతలో రాజీ పడకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు పనులు పూర్తి చేయాలని సూచించారు.
: వెంకటాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
