నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక బస్టాండ్‌కు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఘనంగా శంకుస్థాపన చేశారు. సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మించనున్న ఈ బస్టాండ్ ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకోనుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత తెలంగాణలోని 365వ బస్టాండ్‌గా నాగర్‌కర్నూల్ ప్రత్యేక గుర్తింపు పొందనుంది.

ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని విశాలమైన ప్లాట్‌ఫారాలు, ఆధునిక వెయిటింగ్ హాళ్లు, డిజిటల్ ప్రయాణ సమాచార వ్యవస్థ, విస్తృత పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. అదనంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మల్టీప్లెక్స్ వంటి నిర్మాణాలకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ బస్టాండ్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ బస్టాండ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ వద్ద 10,170 బస్సులు, 97 డిపోలు, 364 బస్టాండ్లు ఉండగా, రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 326 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించగా, రూ.11,377 కోట్ల ప్రయాణ వ్యయం ఆదా చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని, 355 మంది ఉద్యోగులకు తిరిగి నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు నడిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులు తక్కువ నీటితో అధిక లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందన్నారు. గత ప్రభుత్వ అప్పులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిరంతరంగా అమలు చేస్తోందని చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉయ్యాలవాడలో రూ.200 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. కొత్త బస్టాండ్ నిర్మాణంతో పట్టణంలో వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్–తూడుకుర్తి–వనపర్తి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసును మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్‌లో రూ.12 కోట్లతో అత్యాధునిక బస్టాండ్‌కు శంకుస్థాపన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *