నాగర్‌కర్నూల్, జూన్ 13: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు, వరద నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వరద నీటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని సూచించారు. అలాగే చెట్ల కింద, విద్యుత్ తీగలు, ఎలక్ట్రిక్ పోల్స్ సమీపంలో నిల్చోరాదని స్పష్టం చేశారు.

పాత ఇళ్లు, బలహీనమైన షెడ్లలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించిన చైర్మన్, వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని కోరారు.

తడి చేతులతో విద్యుత్ పరికరాలు, స్విచ్ బోర్డులను ముట్టుకోరాదని, ఉరుములు-మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించారు. పిల్లలను వాగులు, కాలువలు, నీటి నిల్వ ప్రాంతాల వద్దకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరుతూ, ప్రజల సహకారంతోనే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర తెలిపారు.: నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *