నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు మంత్రి సూచించారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపడుతూ, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు.
విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధునిక వసతులు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలతో పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విజన్ అని చెప్పారు.
విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి తెలంగాణ విద్యార్థులను భవిష్యత్ పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. జటప్రోలు పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.: జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన..




