గద్వాల జిల్లా దరూర్ మండలం పెద్దచింతరేవుల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆషాఢ కృష్ణ దశమి సందర్భంగా ఉత్తరాది మఠం పీఠాధిపతులు 1008 విద్యా దేశ తీర్థ శ్రీపాదులు, 1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కృష్ణానది తీరంలో, జూరాల ప్రాజెక్టు సమీపంలో 18వ శతాబ్దంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామివారికి పీఠాధిపతులు సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, అష్టోత్తర పూజలు, మహా మంగళహారతి వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా స్వామివారిని ఆరాధించడం ద్వారా భక్తులకు మానసిక ప్రశాంతత, ఐశ్వర్యం లభిస్తాయని తెలిపారు. ఆంజనేయ స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించే వారికి ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. గురువులను దర్శించి, సేవించి, పూజించడం ద్వారా గురుబలం లభిస్తుందని వివరించారు.

ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు మాట్లాడుతూ 18వ శతాబ్దంలో వ్యాస శేషదాసుల వారు స్వామివారిని ప్రతిష్ఠించినట్లు తెలిపారు.

పెద్దచింతరేవుల అన్నప్రసాద కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం పంపిణీ చేశారు. రానున్న 55 రోజుల పాటు ఆలయాన్ని సందర్శించే భక్తులకు అల్పాహారం, అన్నప్రసాద వసతి అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.: పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామికి ఉడిపి, పాలిమార్ పీఠాధిపతుల ప్రత్యేక పూజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *