ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులకు శాస్త్రీయ సాగు విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అధిక నీటి అవసరమున్న వరి పంటకు బదులుగా పత్తి, కందులు, మినుములు, పెసలు, ఉలవలు, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
వర్షాభావ మండలాలు, గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, అంచనాలను వెంటనే రైతులకు చేరవేసి తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన సబ్సిడీలు, నాణ్యమైన విత్తనాలు, పంట బీమా, కనీస మద్దతు ధర, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి గ్రామంలో నీటి వనరుల మ్యాపింగ్ నిర్వహించి, ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని, భూగర్భ జలాలను పొదుపుగా ఉపయోగించాలని రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకుంటే వర్షాభావ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.: ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తం..
