బెక్కేరలో రీ-సర్వే పనుల పరిశీలన.. పారదర్శకంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ చెన్నయ్య

కల్వకుర్తి: పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రీ-సర్వే జరుగుతున్న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని బెక్కేర గ్రామాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ బి. చెన్నయ్య సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు.

రీ-సర్వే ప్రక్రియలో భాగంగా చేపడుతున్న సర్వే విధానం, భూ వివరాల నమోదు తదితర అంశాలపై అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సర్వే నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిబంధనలకు అనుగుణంగా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

రీ-సర్వేపై గ్రామ ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, భూ యజమానులకు సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. భూ యజమానులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకునేలా అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.

రీ-సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, భూ వివరాల నమోదు, కొలతలు, ఇతర రికార్డుల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలకు అవకాశం లేకుండా ఖచ్చితమైన వివరాలను నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు.

రీ-సర్వే పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో, తహసీల్దార్, మండల సర్వేయర్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

: బెక్కేరలో రీ-సర్వే పనుల పరిశీలన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *