నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి నూతన కోర్టులో బ్యాడ్మింటన్ ఆడి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పోలీసులు రాత్రింబవళ్లు పనిచేస్తూ తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. క్రీడల ద్వారా శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు.
పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడలను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటే విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయగలరని అన్నారు.
ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు విధులు నిర్వహించే పోలీసు సిబ్బందిలో ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చని అన్నారు. ఇండోర్ షటిల్ కోర్టు ఏర్పాటుకు సహకరించిన కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఎస్పీ అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
: పోలీసు సిబ్బంది దృఢత్వానికి క్రీడలు అవసరం..





