నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ బి. చెన్నయ్యతో కలిసి ఐడీఓసీలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్.. సిబ్బంది హాజరు, కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారని, అందువల్ల కార్యాలయాలు పరిశుభ్రంగా, క్రమబద్ధంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సిబ్బంది సమయపాలనతో విధులకు హాజరై ప్రజలకు సేవలను సకాలంలో అందించాలని సూచించారు.
కలెక్టరేట్ రికార్డు గది, స్టోర్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్.. ఏళ్ల తరబడి వినియోగంలో లేని రికార్డులను నిబంధనల ప్రకారం వర్గీకరించి, తొలగించేందుకు అర్హమైన వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఏవోను ఆదేశించారు. భవిష్యత్తులో అవసరమయ్యే కీలక రికార్డులను మాత్రం సురక్షితంగా, క్రమబద్ధంగా భద్రపరచాలని సూచించారు.
ట్రెజరీ కార్యాలయ ఆవరణలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని వెంటనే శుభ్రం చేయాలని, అక్కడ మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అధికారులకు సూచించారు. కార్యాలయాల పరిసరాలు, మెట్ల మార్గాలు, పార్కింగ్, ఖాళీ ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు.
సర్వర్ రూమ్‌లు, ఎలక్ట్రికల్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ పరికరాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన మృతి చెందిన మహిళకు జన్మించిన చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై డీఎంహెచ్‌ఓను అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి అవసరమైన వైద్య సేవలు, ప్రభుత్వ సహాయం సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు.
తనిఖీలో డీఆర్వో పాండు, ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
: ఐడీఓసీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు..






