భూమి కౌలు వివాదంతో మహిళ దారుణ హత్య.. నిందితురాలు అరెస్ట్

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి కౌలు విషయంలో ఏర్పడిన విభేదాలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మృతురాలి బంధువైన కరావత్ హీరమ్మ అలియాస్ హీరి నిందితురాలిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఇప్పల తండాకు చెందిన 43 ఏళ్ల కేతావత్ చిట్టెమ్మను ఆగస్టు 15వ తేదీ రాత్రి ఆమె ఇంట్లోనే హత్య చేశారు. భూమిలో తనకు వాటా ఇవ్వడం లేదని, కౌలు కూడా ఇవ్వడం లేదన్న కోపంతో హీరమ్మ మృతురాలిపై హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్య జరిగిన రాత్రి నిందితురాలు మృతురాలి ఇంటికి వెళ్లి సారాయి తాగుదామని చెప్పి ఆమెను నిద్రలేపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతురాలు తిరిగి నిద్రలోకి వెళ్లిన తర్వాత కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న వెండి కడియాలు, కాళ్లగొలుసులను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

హత్య అనంతరం వెండి ఆభరణాలను నిందితురాలు తన ఇంట్లో దాచినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితురాలి వద్ద నుంచి వెండి కడియాలు, కాళ్లగొలుసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు బిజినపల్లి పోలీసులు తెలిపారు. నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు.

కేసు ఛేదనలో సీఐ అశోక్ రెడ్డి, ఎస్‌ఐ షంషాదిన్, కానిస్టేబుళ్లు భీముడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

: నాగర్‌కర్నూల్‌లో మహిళ హత్య కేసు ఛేదన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *