కోర్టు స్టే కారణంగానే పథకం నిలిచిపోయిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, స్టేకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సుమారు 14.50 లక్షల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం అందించామని ఆయన పేర్కొన్నారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తులు పెరగాల్సి ఉండగా, కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కోర్టు కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంలో ఆలస్యం చేసిందని, దీనివల్లే స్టే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. సింగిల్ జడ్జి స్టే ఇచ్చిన వెంటనే డివిజన్ బెంచ్‌ను ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆందోళనల తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు.
అలాగే రాజకీయ ప్రత్యర్థులపై కేసులకు భారీ మొత్తంలో న్యాయవాదుల ఫీజులు చెల్లిస్తున్న ప్రభుత్వం, లక్షలాది మంది పేద ఆడబిడ్డల భవిష్యత్తుతో ముడిపడిన కల్యాణ లక్ష్మి కేసుపై ఎందుకు నిర్లక్ష్యం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు: కల్యాణ లక్ష్మిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో నీరుగార్చింది






