నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపురం చౌరస్తాలో జరుగుతున్న జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద “గో స్లో” సూచనలు తెలుపుతూ వైట్ పెయింట్ వేయడం, స్కూల్ జోన్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడ్ బ్రేకర్లను సక్రమంగా నిర్మించడం వంటి చర్యలు ప్రజల్లో అప్రమత్తత పెంచుతాయని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణాలను విశ్లేషించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పనులు పూర్తి చేయడమే కాకుండా, నాణ్యతను కూడా నిర్ధారించాలని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడంకంటే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవడం, యువతలో స్పీడ్‌పై నియంత్రణ లేకపోవడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమని, ఇద్దరూ కలిసి పనిచేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అమలు చేస్తున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీవో చిన్న బాలు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, పోలీస్ అధికారులు మరియు ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.: రోడ్డు భద్రత అందరి బాధ్యత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *