జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో ఈ నెల 4, 5 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. 15వ శతాబ్దం నాటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని పెద్ద చింతరేవుల అన్నప్రసాద ట్రస్ట్ సత్రంలో ఉడిపి పాలిమర్ మఠం పీఠాధిపతుల సమక్షంలో, ఉడిపి వేద పండితులచే శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్యా చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు.

ఈ నెల 4న శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయం 8 గంటలకు మూలరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సామూహిక విష్ణు సహస్రనామావళితో తులసి పూజ, గోపూజ, పవమాన హోమం, నవగ్రహ హోమం, శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పీఠాధిపతులచే భాగవత, రామాయణ ప్రవచనాలు, అనంతరం తీర్థ ప్రసాద గోష్టి ఉంటుంది. సాయంత్రం సామూహిక తులసి పూజ నిర్వహించనున్నారు.

శుక్రవారం రాత్రి 12.15 గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వేద సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు. శనివారం బ్రహ్మముహూర్తంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగనున్నాయి. ఉట్లు కొట్టుట (ఉట్లు ఉత్సవం), శ్రీకృష్ణ లీలా ఉత్సవం, సుదర్శన చక్ర మండల పూజతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులందరికీ పెద్ద చింతరేవుల అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద పంపిణీ ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.: పెద్ద చింతరేవులలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *