నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు “మన ఇసుక – మన వాహనం” పోర్టల్ ద్వారా మాత్రమే ఇసుక తరలింపు చేపట్టాలని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, వంగూరు మండలాల్లోని మొల్గర, పెదాపూర్, ఉల్పర గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక రీచ్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక తవ్వకం, రవాణా విధానాలను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు.

ఇసుక రవాణా ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ప్రతి వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇసుక తరలిస్తున్నదీ పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రీచ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రాత్రి వేళల్లో కూడా రికార్డులను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. ఆన్లైన్ అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తవ్వకాలు లేదా రవాణా చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులే నిబంధనలు ఉల్లంఘించినా వారికి బాధ్యత తప్పదని స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీ జరిగితే పారదర్శకత పెరిగి, అక్రమాలు గణనీయంగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

“మన ఇసుక – మన వాహనం” పోర్టల్లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించిన కలెక్టర్, ప్రతి దశలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రజలకు అవసరమైన ఇసుక సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.

అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్ల నుంచి అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేసిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట ఉప్పునుంతల, వంగూరు మండలాల రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.: ఆన్‌లైన్ విధానంలోనే ఇసుక రవాణా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *