నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ధన్నోజు నరేష్ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో వారి చదువులు, భవిష్యత్తుపై ప్రభావం పడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

బీజేపీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని ప్రభుత్వం గుర్తించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

తల్లోజు ఆచారి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పేరుకుపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కొన్ని కళాశాలలు ఆర్థిక ఇబ్బందులతో మూసివేత దిశగా వెళ్తున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయకపోతే విద్యార్థులు, యువత, ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.: స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *