ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, దానిని కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని అన్నారు.
వృక్షాలు ఆక్సిజన్ అందించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ వివరించారు. వర్షపాతం, భూగర్భ జలాల పరిరక్షణ, నేల కోతను అరికట్టడం వంటి అనేక ప్రయోజనాలు చెట్ల వల్ల కలుగుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులు పాఠశాల ఆవరణలో జామ, నేరేడు, మామిడి తదితర రకాల 100 మొక్కలను నాటారు. కలెక్టర్ విద్యార్థినితో కలిసి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. నాటిన ప్రతి మొక్కకు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, గ్రామ సర్పంచ్ ఊర్మిలమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఎంపీడీవో చెన్నమ్మ, ఎంఈఓ కురుమయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహనా చారి, అటవీ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.: ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలి
