నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ కొద్దిసేపు ‘సోషల్ టీచర్‌’గా మారి 8వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పాఠం బోధించారు. అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్యరేఖ వంటి అంశాలను బోర్డుపై స్వయంగా వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదును పరిశీలించారు. విద్యార్థుల హాజరు పరిస్థితి, తరగతుల నిర్వహణ, బోధనా విధానం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం ప్రతిరోజూ అందించాలని ఆదేశించారు.

అనంతరం 8వ తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులను సాంఘిక శాస్త్రం అంశాలపై ప్రశ్నించారు. అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏమిటి? భూమధ్యరేఖ ప్రాధాన్యత ఏమిటి? భూమిపై ప్రాంతాలను గుర్తించడంలో వాటి ఉపయోగం ఏమిటి? వంటి ప్రశ్నలు అడిగి విద్యార్థుల అవగాహన స్థాయిని తెలుసుకున్నారు.

విద్యార్థులకు అంశాలు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా కలెక్టర్ స్వయంగా బోర్డుపై అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్యరేఖను చిత్రించి వివరించారు. పాఠ్యాంశాలను కేవలం కంఠస్థం చేయకుండా, వాటి వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని, విద్యార్థులను తరచూ ప్రశ్నిస్తూ వారి అభ్యసన స్థాయిని అంచనా వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా అంకితభావంతో పనిచేయాలని అన్నారు.

కలెక్టర్ స్వయంగా తరగతి గదిలోకి వచ్చి పాఠం బోధించడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయన వెంట అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రజాక్ తదితరులు ఉన్నారు.: తనిఖీకి వచ్చి.. సోషల్ పాఠం చెప్పిన కలెక్టర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *