నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలను తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. వేసవి దృష్ట్యా సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు షామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సభలు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాలని అధికారులకు ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి గర్భిణీలు, చిన్నారులకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. విద్యాశాఖ, వ్యవసాయ శాఖల కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.

ప్రజలు గ్రామ సభలకు హాజరై స్థానిక సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.: ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *