నాగర్‌కర్నూల్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసిన నకిలీ డీఏపీ సూత్రధారులపై వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులతో రాజకీయం చేయకుండా వారి సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. కరువు, ఎరువుల కొరత, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నకిలీ డీఏపీ దందాలో పాల్గొన్న దళారులను కాపాడుతున్నారని ఆరోపిస్తూ, అక్రమంగా సంపాదించిన లాభాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మొక్కజొన్న కొనుగోళ్లు, గన్నీ బ్యాగుల సరఫరా, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపుల్లో కూడా అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. గన్నీ బ్యాగుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను దోచుకున్నారని, సబ్సిడీ మొత్తాలు రైతుల ఖాతాల్లో జమ కాలేదని పేర్కొన్నారు. అలాగే వరి, మొక్కజొన్న ట్రాన్స్‌పోర్ట్ బకాయిలను వెంటనే రైతులకు చెల్లించాలని కోరారు.

బిజినపల్లి ప్రాంతంలో రైతులను మోసం చేసిన ప్రైవేట్ దళారులపై చర్యలు తీసుకోవాలని, రైతు సమస్యలపై ఇప్పటికే కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కులను ప్రభుత్వం కాపాడలేకపోయిందని, కల్వకుర్తి ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే కలెక్టరేట్ ఎదుట వంటావార్పు, భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.: నకిలీ డీఏపీ సూత్రధారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *