ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి రాష్ట్ర స్థాయిలో జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ ప్రజావాణి సమావేశ మందిరంలో విద్యాశాఖపై మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా విద్యార్థుల నమోదు, హాజరు, అభ్యసన స్థాయి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌), పాఠశాలల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ), సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, ప్రభుత్వ సౌకర్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు చదవడం, రాయడం, గణితంలో పునాది నైపుణ్యాలు కల్పించాలని అన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించి, డి-గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని వ్యక్తిగతంగా అంచనా వేసి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఈ నెల 31లోగా అవసరమైన సర్టిఫికెట్లు జారీ చేయించి చేయూత పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత ఉన్న ఎస్టీ విద్యార్థులందరికీ రాజీవ్ విద్యా దీవెన పథకం ద్వారా ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో డీఈఓ ఏ. రమేష్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *