నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం షీ టీం, భరోసా ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, ఆకతాయి చేష్టలు, మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా షీ టీం ఇన్‌చార్జ్ ASI విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు, బాలికలపై వేధింపులు, ఆకతాయి చేష్టలు, ఆన్‌లైన్ మోసాలు, నమ్మించి మోసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే భయపడకుండా వెంటనే షీ టీంను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
మహిళలు, బాలికలకు భద్రత కల్పించడంలో షీ టీం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు తదితర ప్రదేశాల్లో షీ టీం నిఘా కొనసాగిస్తుందని, ఆకతాయిల వేధింపులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. షీ టీంను **8712657676** నంబర్‌లో సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
భరోసా కోఆర్డినేటర్ శ్రీలత మాట్లాడుతూ షీ టీంతో కలిసి భరోసా కేంద్రం పనిచేస్తుందని వివరించారు. పోక్సో, అత్యాచార చట్టాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కళాజాత బృందం భాస్కర్ టీం, షీ టీం బృందం వెంకటయ్య, కళాశాల ప్రిన్సిపాల్ అనసూయ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు మహిళా భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలని నిర్వాహకులు సూచించారు.: మహిళలు, బాలికలకు అండగా షీ టీం..




