రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలందింపును లక్ష్యంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్పై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లకు సూచించారు.

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లకు భూ భారతి పోర్టల్ నిర్వహణ, భూ భారతి చట్టం, ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కార విధానంపై ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ రికార్డుల్లో పారదర్శకతను పెంచడం, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సకాలంలో సేవలు అందించడం, భూ వివాదాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను రూపొందించిందన్నారు. ఈ లక్ష్యాల సాధనలో రెవెన్యూ శాఖ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు.

భూ భారతి పోర్టల్‌కు సంబంధించిన అన్ని మాడ్యూళ్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, లాగిన్ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని, ప్రతి దరఖాస్తును ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత గడువులో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుదారులకు స్లాట్ బుకింగ్, విచారణ తేదీలను ముందుగానే తెలియజేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

శిక్షణలో భాగంగా భూ భారతి చట్టంలోని వివిధ అధికరణలు, దరఖాస్తుల నమోదు, పరిశీలన, ధ్రువీకరణ, అనుమతులు, తిరస్కరణ ప్రక్రియలను సవివరంగా వివరించారు. ప్రస్తుతం భూ భారతి పోర్టల్‌లో 13 రకాల మాడ్యూళ్లు అందుబాటులో ఉండగా, గతంలో 33 మాడ్యూళ్ల ద్వారా జరిగే ప్రక్రియను ప్రభుత్వం సరళీకరించినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, ఆర్డీవో బన్సీలాల్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్ కార్యాలయాల రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.: భూ భారతి పోర్టల్‌పై పూర్తి అవగాహన పెంచుకోండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *